పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు ప్రపంచ దేశాలను ఆందోళనకు గురిచేస్తుండగా, భారత ప్రభుత్వం అత్యంత అప్రమత్తంగా వ్యవహరిస్తోంది. ఈ సంక్షోభం తాలూకు ప్రభావం దేశీయంగా విమానయాన రంగం, ఇంధన సరఫరా మరియు విదేశాల్లో ఉన్న భారతీయుల భద్రతపై పడకుండా కేంద్ర ప్రభుత్వం బహుముఖ వ్యూహాన్ని అమలు చేస్తోంది. ఈ మేరకు మంగళవారం న్యూఢిల్లీలోని నేషనల్ మీడియా సెంటర్‌లో నిర్వహించిన ఇంటర్-మినిస్ట్రియల్ బ్రీఫింగ్‌లో పెట్రోలియం, విమానయాన, నౌకాయాన మరియు విదేశీ వ్యవహారాల శాఖలు కీలక వివరాలను వెల్లడించాయి.

ఆకాశమార్గంలో సవాళ్లు: నిలకడగా విమాన ఛార్జీలు

ఫిబ్రవరి చివరి వారం నుండి పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఘర్షణలు భారత విమానయాన రంగాన్ని క్లిష్ట పరిస్థితుల్లోకి నెట్టాయి. ఇరాన్, ఇజ్రాయెల్, కువైట్, యూఏఈ వంటి దేశాలు తమ గగనతలాన్ని మూసివేయడం లేదా ఆంక్షలు విధించడంతో అంతర్జాతీయ విమాన రాకపోకలకు తీవ్ర విఘాతం కలిగింది.

 విమానయాన సంస్థల నిర్వహణ వ్యయంలో 40 శాతం వాటా ఉండే విమాన ఇంధనం (ATF) ధరల విషయంలో కేంద్రం సకాలంలో జోక్యం చేసుకుంది. దీనివల్ల అంతర్జాతీయంగా ఇంధన ధరలు పెరిగినప్పటికీ, దేశీయంగా విమాన ప్రయాణ భారం పెరగకుండా ప్రభుత్వం కట్టడి చేయగలిగింది. గగనతల ఆంక్షల వల్ల ఐరోపా, ఉత్తర అమెరికా వెళ్లే విమానాలు సుదీర్ఘ మార్గాల్లో ప్రయాణించాల్సి వస్తోంది. ఈ అదనపు ప్రయాణ సమయం వల్ల పైలట్లు, సిబ్బంది కొరత ఏర్పడకుండా 'ఫ్లైట్ డ్యూటీ టైమ్' నిబంధనలను డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA) తాత్కాలికంగా సడలించింది. నిత్యావసర వస్తువుల సరఫరాకు ఆటంకం కలగకుండా ఎమిరేట్స్, కువైట్ ఎయిర్‌వేస్ వంటి విదేశీ సంస్థలకు ప్రయాణికుల విమానాల్లోనే కార్గో రవాణా చేసుకునేందుకు ప్రత్యేక అనుమతులు మంజూరు చేసింది.

పైప్డ్ నేచురల్ గ్యాస్ సరఫరాను వేగవంతం

హోర్ముజ్ జలసంధి ప్రాంతంలో ఉద్రిక్తతల నేపథ్యంలో చమురు దిగుమతులపై ఆందోళనలు వ్యక్తమవుతున్నప్పటికీ, దేశంలో పెట్రోల్, డీజిల్, గ్యాస్ సరఫరా సాధారణంగానే ఉందని కేంద్ర పెట్రోలియం శాఖ స్పష్టం చేసింది. ఇందులో భాగంగా వలస కార్మికుల కోసం 5 కిలోల FTL (ఫ్రీ ట్రేడ్ ఎల్పీజీ) సిలిండర్ల కోటాను ప్రభుత్వం రెట్టింపు చేసింది. గత నాలుగు రోజుల్లోనే 1300 అవగాహన శిబిరాలు నిర్వహించగా, సోమవారం ఒక్కరోజే 1.06 లక్షల సిలిండర్లు అమ్ముడయ్యాయి. ఎల్పీజీపై ఒత్తిడి తగ్గించేందుకు పైపుల ద్వారా గ్యాస్ (PNG) సరఫరాను వేగవంతం చేశారు. మార్చి 2026 నుండి ఇప్పటివరకు 3.76 లక్షల కొత్త కనెక్షన్లు ఇచ్చారు. ఇంధన కొరత ఉందనే పుకార్లను నమ్మవద్దని, ప్రజలు భయాందోళనలతో పెట్రోల్ బంకులకు క్యూ కట్టవద్దని ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది. అలాగే బ్లాక్ మార్కేంటిగ్ పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటోంది. నిన్న ఒక్కరోజే దేశవ్యాప్తంగా 4300 దాడులు నిర్వహించి 1200 సిలిండర్లను సీజ్ చేశారు.

స్వదేశానికి చేరుకున్న 7.6 లక్షల మంది భారతీయులు

పశ్చిమాసియాలో చిక్కుకున్న భారతీయ పౌరుల భద్రతే తమ ప్రథమ ప్రాధాన్యమని విదేశీ వ్యవహారాల శాఖ తెలిపింది. ఫిబ్రవరి 28 నుండి ఇప్పటివరకు సుమారు 7,60,000 మంది భారతీయులు ఆ ప్రాంతం నుండి స్వదేశానికి చేరుకున్నారు. కువైట్, బహ్రెయిన్ గగనతలాలు మూతబడటంతో అక్కడి భారతీయులను సౌదీ అరేబియాలోని దమ్మామ్ విమానాశ్రయానికి తరలించి, అక్కడి నుండి ప్రత్యేక విమానాల ద్వారా భారత్‌కు తీసుకువస్తున్నారు. ఇరాన్ నుండి 1,862 మంది భారతీయులను అర్మేనియా, అజర్‌బైజాన్ మీదుగా తరలించారు. సముద్ర మార్గాల్లో ప్రయాణించే భారతీయ నౌకల భద్రతను డీజీ షిప్పింగ్ నిరంతరం పర్యవేక్షిస్తోంది. గత 24 గంటల్లో 92 మందితో కలిపి ఇప్పటివరకు మొత్తం 1,691 మంది భారతీయ నావికులను సురక్షితంగా స్వదేశానికి రప్పించారు.

యుద్ధ మేఘాలు కమ్ముకున్న వేళ, దేశీయ అవసరాలకు ఇబ్బంది కలగకుండా ప్రభుత్వం ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించి వినియోగదారులకు ఊరటనిచ్చింది. పెట్రోల్, డీజిల్ ధరలు పెరగకుండా చర్యలు తీసుకుంటూనే, మరోవైపు ఎగుమతులపై లెవీని పెంచి దేశీయ నిల్వలను కాపాడుతోంది. విదేశాల్లో ఉన్న విద్యార్థులు, కార్మికులు, నావికుల రక్షణ కోసం ప్రత్యేక కంట్రోల్ రూమ్‌లు 24 గంటలూ పనిచేస్తున్నాయి. మొత్తానికి, పశ్చిమాసియా సంక్షోభం దేశ ఆర్థిక వ్యవస్థపై పెను ప్రభావం చూపకుండా కేంద్రం అనుసరిస్తున్న బహుముఖ వ్యూహం సత్ఫలితాలను ఇస్తోంది.

పి ఐ బి