ప్రపంచవ్యాప్తంగా ప్రతి సంవత్సరం వేలాది మంది పిల్లలు జన్యుపరమైన ప్రత్యేక పరిస్థితులతో జన్మిస్తున్నారు. వాటిలో అతి ముఖ్యమైనది 'డౌన్ సిండ్రోమ్'. చాలా మంది దీనిని ఒక జబ్బుగా భావిస్తారు, కానీ వైద్యులు చెబుతున్నవివరాల ప్రకారం ఇది వ్యాధి కాదు, జన్యు నిర్మాణంలో వచ్చే మార్పుల వల్ల ఏర్పడే ఒక ప్రత్యేక స్థితి. ప్రతి ఏటా మార్చి 21న 'ప్రపంచ డౌన్ సిండ్రోమ్ దినోత్సవం' నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా 'డౌన్ సిండ్రోమ్' పై అవగాహన పెంచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

డౌన్ సిండ్రోమ్ అంటే ఏమిటి?

సాధారణంగా మనిషి శరీరంలో 46 క్రోమోజోమ్స్ (23 జతలు) ఉంటాయి. అయితే డౌన్ సిండ్రోమ్ ఉన్న పిల్లల్లో 21వ క్రోమోజోమ్ రెండుకు బదులుగా మూడు కాపీలుగా ఉండటం (Trisomy 21) వల్ల ఈ పరిస్థితి ఏర్పడుతుంది. ఈ చిన్న మార్పు పిల్లల శారీరక, మానసిక అభివృద్ధిపై తీవ్ర ప్రభావం చూపుతుంది.

ఆందోళన కలిగిస్తున్న గణాంకాలు: మన దేశంలో ప్రతి 1000 మందిలో ఒకరు ఈ సమస్యతో బాధపడుతున్నారు. తాజా నివేదికల ప్రకారం, ఈ సంఖ్య 830 మందిలో ఒకరికి చేరుతోంది. భారతదేశంలో ఏటా సుమారు 30,000 నుండి 35,000 మంది పిల్లలు డౌన్ సిండ్రోమ్‌తో జన్మిస్తున్నారు. 20 ఏళ్ల వయస్సులో తల్లి అయ్యే వారిలో 2వేల మందిలో ఒకరికి రిస్క్ ఉంటే, 40 ఏళ్లు దాటిన మహిళల్లో ఇది ప్రతి 100 మందిలో ఒకరికి ఉండే అవకాశం ఉంది.

ప్రధాన లక్షణాలు:

1.శారీరక రూపం: చదునైన ముఖం, పైకి వాలి ఉన్న కళ్లు, చిన్న ముక్కు, తరచుగా బయటకు వచ్చే నాలుక, చిన్న మెడ మరియు వెడల్పాటి చేతులు. అరచేతిలో ఒకే అడ్డ రేఖ ఉండటం దీని ప్రధాన గుర్తు.

2. ఎముకలు, కండరాలు: కండరాలు బలహీనంగా ఉండటం వల్ల వీరు నడవడానికి, కూర్చోవడానికి ఎక్కువ సమయం తీసుకుంటారు. పాదాలు చదునుగా ఉంటాయి.

3. మానసిక స్థితి: బుద్ది వికాసం నెమ్మదిగా ఉంటుంది. ఏదైనా నేర్చుకోవడంలో ఇబ్బంది పడతారు. మాటలు రావడం ఆలస్యమవుతుంది.

4. ఆరోగ్య సమస్యలు: పుట్టుకతోనే గుండె రంధ్రాలు ఉండటం, వినికిడి లోపం, కంటి చూపు సమస్యలు మరియు థైరాయిడ్ వచ్చే అవకాశం ఉంది.

పరిష్కారం ఏమిటి?

డౌన్ సిండ్రోమ్ పూర్తిగా నయం కాదు, కానీ సరైన థెరపీల ద్వారా వారి జీవితాన్ని సాధారణం చేయవచ్చు:థెరపీలు: మాటల కోసం స్పీచ్ థెరపీ, కండరాల బలం కోసం ఫిజియోథెరపీ అందించాలి. వీరి కోసం ప్రత్యేక పాఠశాలలు ఉంటాయి. పెయింటింగ్, సంగీతం, క్రీడలలో శిక్షణ ఇస్తే వీరు అద్భుతాలు చేస్తారు. గర్భధారణ సమయంలో చేసే అనోమలీ స్కాన్ ద్వారా ఈ పరిస్థితిని ముందే గుర్తించి, తల్లిదండ్రులు మానసిక సిద్ధత పొందే అవకాశం ఉంటుంది.

డౌన్ సిండ్రోమ్ ఉన్న పిల్లలకు కావాల్సింది సానుభూతి కాదు, సమానత్వం. వారిని ప్రేమతో ఆదరించి, సరైన శిక్షణ ఇస్తే వారు కూడా సమాజంలో గౌరవంగా జీవించగలరు.