వేసవిలో భానుడు తన ప్రతాపం చూపిస్తున్న వేళ, చల్లని బీరుతో సేదతీరాలనుకునే వారికి ఇది చేదు వార్త . బీరు ఇంకా పెదవులకు చేరకముందే, అంతర్జాతీయ మార్కెట్ గాలులు దాని రుచిని, ధరను మార్చేస్తున్నాయి. ఎక్కడో పశ్చిమ ఆసియాల రగులుతున్న యుద్ధ జ్వాలలు, ఇప్పుడు భారతదేశంలోని మద్యం సీసాల ధరలను మార్చేయటానికి సిద్ధమవుతున్నాయి.

యుద్ధం అక్కడ.. వేడి ఇక్కడ!

ఇరాన్-ఇజ్రాయెల్-అమెరికా మధ్య నెలకొన్న ఉద్రిక్తతలు భారత అల్కహాల్ పరిశ్రమపై కోలుకోలేని దెబ్బ తీస్తున్నాయి. భారత్ తన గ్యాస్ అవసరాలలో దాదాపు 40% ఖతార్ నుండి దిగుమతి చేసుకుంటుంది. అయితే, ఇరాన్ దాడుల కారణంగా ఖతార్ ఎగుమతి సామర్థ్యం దెబ్బతినడం, గ్యాస్ సరఫరాలో అంతరాయం కలగడం వల్ల ఉత్పత్తి రంగం సంక్షోభంలో పడింది. గ్యాస్ కొరత కారణంగా గాజు సీసాల తయారీ ఖర్చు ఏకంగా 20% పెరిగింది. ఇది చాలదన్నట్టు, పేపర్ కార్టన్లు, లేబుల్స్, టేపుల వంటి ప్యాకేజింగ్ మెటీరియల్స్ ధరలు కూడా రెట్టింపు అయ్యాయి.

గాజు సీసాల తయారీకి 'నేచురల్ గ్యాస్' అత్యంత కీలకం. గ్యాస్ అందక ఉత్తరప్రదేశ్‌లోని ఫిరోజాబాద్ వంటి గాజు తయారీ కేంద్రాల్లో ఇప్పటికే ఉత్పత్తిని 40% తగ్గించేశారు. దీనివల్ల మార్కెట్లో ఖాళీ సీసాల కొరత ఏర్పడి, బీర్ ఉత్పత్తిపై నేరుగా ప్రభావం చూపుతోంది. కేవలం బీర్ మాత్రమే కాదు, సాఫ్ట్ డ్రింక్స్, బాటిల్ వాటర్, జ్యూస్ కంపెనీలు కూడా ప్లాస్టిక్ బాటిళ్లు మరియు క్యాప్‌ల ధరలు పెరగడంతో సతమతమవుతున్నాయి. ఇప్పటికే బాటిల్ వాటర్ ధరలు 11% మేర పెరిగాయి.

ఎంత భారం పడనుంది?

ప్రస్తుత సంక్షోభం దృష్ట్యా 'బ్రూవర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా' – బి ఏ ఐ ధరల పెంపునకు మొగ్గు చూపుతోంది. మార్కెట్ వర్గాల అంచానాల ప్రకారం బీర్ బాటిల్ ధరపై 12% నుండి 15% వరకు పెరుగుదల ఉండొచ్చు. రవాణా మరియు లాజిస్టిక్స్ ఖర్చులు ఇప్పటికే 10% పెరిగాయి. మద్యం ధరలు ప్రభుత్వ నియంత్రణలో ఉండటంతో, కంపెనీలు ఇప్పటికే పలు రాష్ట్రాలకు ధరల సవరణ కోరుతూ లేఖలు రాశాయి. ఒకవేళ అనుమతి లభించకపోతే, ఆయా రాష్ట్రాల్లో బీర్ కొరత ఏర్పడే ప్రమాదం త్వరలో ఎదుర్కోవలసినపరిస్థితి అనివార్యంగా కనిపిస్తింది.

మార్కెట్ జోరు.. సవాళ్లు తీరు!

ఇంటర్నేషనల్ మార్కెట్ అనాలిసిస్ రీసెర్చ్ అండ్ కన్సల్టింగ్ గ్రూప్, గ్రాండ్ వ్యూ రీసెర్చ్ నివేదికల ప్రకారం, భారతదేశంలో బీర్ మార్కెట్ 2024లో $7.8 బిలియన్ల (దాదాపు ₹65,000 కోట్లు) విలువ కలిగి ఉంది. 2030 నాటికి ఇది రెట్టింపు అవుతుందని అంచనా. దేశీయ మార్కెట్లో హైనెకెన్ సగం వాటాను కలిగి ఉండగా,

ప్రపంచంలోనే అత్యంత పెద్ద బీర్ తయారీ సంస్థ అన్హ్యూజర్-బుష్ ఇన్ బెవ్. దీనికి సంభందించిన అంతర్జాతీయ బ్రాండ్లు బడ్‌వైజర్ , కరోనా , స్టెల్లా ఆర్టోయిస్, హేవర్డ్స్ 5000, నాకౌట్ , బెక్‌స్ ఐస్ వంటివి భారత బీర్ మార్కెట్‌లో 19% వాటా కలిగి ఉన్నాయి.

ఇక భారతీయ మార్కెట్లో వేగంగా ఎదుగుతున్న 'లోకల్ క్రాఫ్ట్ బీర్' బ్రాండ్లు. బీరా, సింబా వీటిలో బీరా 91 దీనిని బి9 బ్రేవరేజెస్ అనే కంపెనీ తయారు చేస్తుంది. దీని వ్యవస్థాపకుడు అంకుర్ జైన్. దీనికి సెకోయా క్యాపిటల్ మరియు కిరిన్ హోల్డింగ్స్ వంటి అంతర్జాతీయ సంస్థల నుండి పెట్టుబడులు ఉన్నాయి. అదేవిధంగా సింబాను సింబా క్రాఫ్ట్ బేవరేజెస్ అనే సంస్థ తయారు చేస్తుంది. దీని వ్యవస్థాపకుడు ప్రభాత్ మోర్. ఇది ఛత్తీస్‌గఢ్‌కు చెందిన కంపెనీ. దేశీయంగా మంచి ఆదరణ పొందిన క్రాఫ్ట్ బీర్ బ్రాండ్లలో ఇది ఒకటి.

అంతర్జాతీయ యుద్ధ మేఘాలు, ముడిసరుకుల కొరత మరియు ముంచుకొస్తున్న వేసవి డిమాండ్.. ఇవన్నీ కలిసి ఈసారి బీర్ ప్రియులకు గట్టి షాక్ ఇవ్వబోతున్నాయి. ప్రభుత్వాలు ధరల పెంపునకు గ్రీన్ సిగ్నల్ ఇస్తే వినియోగదారుడి జేబుకు చిల్లు పడటం ఖాయం, లేదంటే మార్కెట్లో 'స్టాక్' దొరకడం గగనమవ్వచ్చు.