ప్రస్తుత ఆధునిక కాలంలో మారుతున్న జీవనశైలి, ఆహారపు అలవాట్ల కారణంగా టైప్-2 డయాబెటిస్ (మధుమేహం), ఊబకాయం వంటి సమస్యలు మానవాళిని పీడిస్తున్నాయి. ఈ నేపథ్యంలో, వైద్య రంగంలో విప్లవాత్మక మార్పుగా భావిస్తున్న 'GLP-1' (గ్లూకాగాన్-లైక్ పెప్టైడ్-1 అగోనిస్ట్) మందులు ప్రపంచవ్యాప్తంగా పెను సంచలనం సృష్టిస్తున్నాయి. అయితే, వీటి వినియోగం పెరగడంతో పాటు, అనధికారిక విక్రయాలు, దుష్ప్రభావాల ముప్పు కూడా పొంచి ఉందన్న హెచ్చరికలు జారీ అవుతున్నాయి. ఈ నేపథ్యంలో భారత ప్రభుత్వం మేల్కొని, వీటి విక్రయాలపై కఠిన ఆంక్షలు విధిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది.

బరువు తగ్గించడంలో 'మ్యాజిక్'.. కానీ జాగ్రత్త!

సాధారణంగా మనం ఆహారం తీసుకున్నప్పుడు మన జీర్ణవ్యవస్థ దానిని చక్కెరగా మారుస్తుంది. ఈ సమయంలో చిన్న ప్రేగుల నుండి 'GLP-1' అనే హార్మోన్ సహజంగా విడుదలవుతుంది. ఇది క్లోమగ్రంధి – ప్యాన్క్రియాస్ ని ప్రేరేపించి ఇన్సులిన్‌ను విడుదల చేయడమే కాకుండా, రక్తంలో చక్కెర స్థాయిని పెంచే 'గ్లూకాగాన్' అనే మరో హార్మోన్‌ను అదుపులో ఉంచుతుంది. తద్వారా రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు సమతుల్యంగా ఉంటాయి.

టైప్-2 డయాబెటిస్ ఉన్నవారిలో ఈ సమతుల్యత దెబ్బతింటుంది. అటువంటి రోగుల కోసం తయారు చేసినవే ఈ GLP-1 అగోనిస్ట్ మందులు. ఇవి శరీరంలో సహజ హార్మోన్ లాగే పనిచేస్తూ, ఇన్సులిన్ విడుదలను పెంచి, చక్కెర స్థాయిలను నియంత్రిస్తాయి. ప్రస్తుతం మార్కెట్లో సెమాగ్లుటైడ్, లిరాగ్లుటైడ్, టిర్జెపాటైడ్, డ్యులాగ్లుటైడ్ వంటి వివిధ రకాల మందులు అందుబాటులో ఉన్నాయి.

ఈ మందులు కేవలం చక్కెర వ్యాధిని అదుపు చేయడమే కాకుండా, బరువు తగ్గించడంలోనూ అద్భుతంగా పనిచేస్తాయని పరిశోధనలు చెబుతున్నాయి. ఇవి జీర్ణక్రియ వేగాన్ని తగ్గించి, కడుపు నిండుగా ఉన్న అనుభూతిని కలిగిస్తాయి. దీనివల్ల ఆకలి తగ్గి, ఆహారం తక్కువగా తీసుకోవడం వల్ల వేగంగా బరువు తగ్గుతారు. అయితే, వైద్యుల పర్యవేక్షణ లేకుండా కేవలం బరువు తగ్గడం కోసమే వీటిని వాడటం అత్యంత ప్రమాదకరమని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

వెంటాడే దుష్ప్రభావాలు: 'ఓజెంపిక్ ఫేస్' నుంచి క్యాన్సర్ వరకు

GLP-1 మందుల వినియోగం వల్ల తలెత్తే దుష్ప్రభావాలు ఆందోళన కలిగిస్తున్నాయి. వీటిని వాడే వారిలో సాధారణంగా వాంతులు, వికారం, విరేచనాలు, మలబద్ధకం, తలనొప్పి, కళ్లు తిరగడం వంటి సమస్యలు తలెత్తుతాయి.

అంతేకాకుండా, అత్యంత వేగంగా ముఖంలో కొవ్వు తగ్గిపోవడం వల్ల ముఖం ముడతలు పడి, కళ్లు లోతుకు పోయి ముసలివారిలా కనిపించే 'ఓజెంపిక్ ఫేస్' అనే విచిత్ర పరిస్థితి ఎదురవుతుంది. మరిన్ని తీవ్రమైన దుష్ప్రభావాలను పరిశీలిస్తే ప్యాంక్రియాటైటిస్, థైరాయిడ్ క్యాన్సర్, మూత్రపిండాల వైఫల్యం, ప్రేగుల్లో అడ్డంకులు, గర్భిణీలలో గర్భస్థ శిశువు పెరుగుదల లోపాలు వంటి సమస్యలు ఎదురవుతాయి.

ప్రభుత్వ కఠిన చర్యలు: లైసెన్సులు రద్దు!

భారత మార్కెట్లో ఈ మందుల డిమాండ్ పెరగడాన్ని ఆసరాగా చేసుకుని కొన్ని ఆన్‌లైన్ ఫార్మసీలు, వెల్‌నెస్ క్లినిక్‌లు వీటిని ఇష్టారాజ్యంగా విక్రయిస్తున్నట్లు ప్రభుత్వం గుర్తించింది. దీనిపై స్పందించిన డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా – డి సి జి ఐ, రాష్ట్రాల డ్రగ్ కంట్రోలర్లతో కలిసి భారీ ఎత్తున తనిఖీలు చేపట్టింది. మార్చి 10, 2026న విడుదల చేసిన మార్గదర్శకాల ప్రకారం, ఈ మందులను కేవలం ఎండోక్రినాలజిస్టులు, ఇంటర్నల్ మెడిసిన్ స్పెషలిస్టులు లేదా కార్డియాలజిస్టులు మాత్రమే సూచించాలి. దేశవ్యాప్తంగా 49 వ్యాపార సంస్థలు, ఆన్‌లైన్ ఫార్మసీల గిడ్డంగులపై మెరుపు దాడులు నిర్వహించారు. తప్పుడు ప్రకటనలు ఇచ్చినా, ప్రిస్క్రిప్షన్ లేకుండా మందులు అమ్మినా భారీ జరిమానాలతో పాటు లైసెన్సులు రద్దు చేస్తామని హెచ్చరించారు.

డయాబెటిస్ మరియు ఊబకాయం నివారణకు జీవనశైలి మార్పులే శ్రేష్ఠమైన మార్గం. వారానికి కనీసం 150 నిమిషాల వ్యాయామం, సరైన ఆహారం, బరువు నియంత్రణ ద్వారా వీటిని అదుపులో ఉంచుకోవచ్చు. GLP-1 మందులు వైద్య చరిత్రలో గొప్ప ఆవిష్కరణలే కావొచ్చు, కానీ అవి స్వయం చికిత్సకు ఏమాత్రం పనికిరావు. ప్రాణాల మీదకు తెచ్చుకోకముందే, అర్హత కలిగిన వైద్యుల సలహా మేరకే వీటిని వాడాలని ప్రభుత్వ యంత్రాంగం ప్రజలను కోరుతోంది.

-పి ఐ బి

ఇవి కూడా చదవండి

మందుల మార్కెట్లో కలకలం: 90 రకాల మెడిసిన్స్‌పై డిసిజిఐ నిఘా.. రంగంలోకి దిగాలని రాష్ట్రాలకు ఆదేశాలు!

https://www.kodikoota.com/article/dcgi-crackdown-90-common-medicines-under-scanner-states-directed-to-take-action

ప్రపంచ డౌన్ సిండ్రోమ్ దినోత్సవం: పిల్లల్లో ఈ లక్షణాలను గమనిస్తున్నారా? ముందస్తు గుర్తింపే శ్రీరామరక్ష!

https://www.kodikoota.com/article/world-down-syndrome-day-signs-symptoms-and-care-how-early-detection-helps-children