కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మక 'ప్రధాన మంత్రి ఇంటర్న్‌షిప్ పథకాన్ని' (PMIS) డిసెంబర్ 2026 వరకు పొడిగించింది. ఈ పైలట్ ప్రాజెక్ట్ కింద 1.10 లక్షల మంది యువతకు అగ్రశ్రేణి కంపెనీలలో శిక్షణ పొందే అవకాశం లభిస్తుంది. నెలకు రూ. 9,000 స్టైపెండ్‌తో పాటు రూ. 6,000 ఇన్సిడెంటల్ గ్రాంట్ అందుతుంది. విద్యార్హతలు, వయోపరిమితి మరియు దరఖాస్తు విధానం వంటి పూర్తి వివరాలను ఈ కథనంలో చదవండి
న్యూ డిల్లి , ఏప్రియల్ 25 : దేశంలోని నిరుద్యోగ యువతకు నైపుణ్య శిక్షణ అందించి, వారిని స్వయం సమృద్ధులుగా తీర్చిదిద్దే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 'ప్రధాన మంత్రి ఇంటర్న్‌షిప్ పథకం' (PMIS) గడువును పొడిగిస్తూ కీలక నిర్ణయం తీసుకున్నారు. గతంలో నిర్ణయించిన లక్ష్యాలకు అనుగుణంగా, ఈ పైలట్ ప్రాజెక్టును 2026 డిసెంబర్ వరకు పొడిగిస్తున్నట్లు కేంద్ర కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రకటించింది. ఈ మేరకు విశ్వవిద్యాలయ నిధుల సంఘం (UGC) సెక్రటరీ ప్రొఫెసర్ మనీష్ ఆర్. జోషి దేశంలోని అన్ని విశ్వవిద్యాలయాల ఉపకులపతులకు మరియు కళాశాలల ప్రధానోపాధ్యాయులకు అధికారిక సమాచారాన్ని పంపారు. ఈ పథకం ద్వారా సుమారు 1.10 లక్షల మంది యువతకు దేశంలోని అగ్రశ్రేణి కంపెనీలలో ప్రత్యక్ష పని అనుభవం పొందే అవకాశం కల్పించనున్నారు.
పీఎం ఇంటర్న్‌షిప్ స్కీమ్ అర్హతలు మరియు వయోపరిమితి
ఈ వినూత్న పథకంలో భాగస్వామ్యం పొందాలనుకునే అభ్యర్థుల వయస్సు 18 నుండి 25 ఏళ్ల మధ్య ఉండాలి. దరఖాస్తుదారులు భారతీయ పౌరులై ఉండటంతో పాటు, ప్రస్తుతం ఎక్కడా పూర్తిస్థాయి ఉద్యోగం చేయకూడదు. విద్యార్హతల విషయానికి వస్తే.. హైస్కూల్, హయ్యర్ సెకండరీ ఉత్తీర్ణులైన వారు, ఐటీఐ సర్టిఫికేట్, పాలిటెక్నిక్ డిప్లొమా కలిగిన వారు లేదా బీఏ, బీఎస్సీ, బీకామ్, బీసీఏ, బీబీఏ వంటి డిగ్రీలు మరియు ఎంఏ, ఎంఎస్సీ వంటి పీజీ పూర్తి చేసిన వారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. ప్రస్తుతం డిస్టెన్స్ లెర్నింగ్ లేదా ఆన్‌లైన్ కోర్సులు చదువుతున్న వారు, అలాగే డిగ్రీ/పీజీ చివరి సంవత్సరంలో ఉన్న విద్యార్థులు కూడా ఈ పథకానికి అర్హులేనని ప్రభుత్వం స్పష్టం చేసింది.
నెలకు రూ. 9,000 స్టైపెండ్ మరియు ఇతర ఆర్థిక ప్రయోజనాలు
ఎంపికైన అభ్యర్థులకు శిక్షణ కాలంలో ప్రతి నెలా రూ. 9,000 ఆర్థిక సహాయం అందుతుంది. ఇందులో రూ. 8,100 కేంద్ర ప్రభుత్వం నేరుగా అభ్యర్థి ఆధార్ అనుసంధాన బ్యాంక్ ఖాతాకు జమ చేస్తుంది (DBT). మిగిలిన రూ. 900 సంబంధిత కంపెనీ తన సామాజిక బాధ్యత (CSR) నిధుల నుంచి చెల్లిస్తుంది. ఇవే కాకుండా, ఇంటర్న్‌షిప్‌లో చేరిన వెంటనే ప్రాథమిక ఖర్చుల నిమిత్తం ప్రభుత్వం ఒకేసారి రూ. 6,000 నగదును రెండు విడతల్లో అందిస్తుంది. శిక్షణలో చేరిన 15 రోజుల్లోగా మొదటి విడత రూ. 3,000, మూడు నెలల శిక్షణ పూర్తి చేసుకున్న తర్వాత రెండో విడత రూ. 3,000 అభ్యర్థులకు అందుతాయి. అలాగే, ప్రతి ఇంటర్న్‌కు ప్రధాన మంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన, ప్రధాన మంత్రి సురక్ష బీమా యోజన వంటి బీమా సౌకర్యాలను కూడా ప్రభుత్వం కల్పిస్తుంది.
ఎంపిక విధానం మరియు శిక్షణ కాలపరిమితి
ఈ పథకం కింద ఇంటర్న్‌షిప్ కాలపరిమితి 6 నుండి 9 నెలల వరకు ఉంటుంది. అయితే, గతంలో ఎంపికైన పాత బ్యాచ్ అభ్యర్థులకు మాత్రం 12 నెలల శిక్షణ కొనసాగుతుంది. శిక్షణ కాలంలో కనీసం సగం సమయం అభ్యర్థులు నేరుగా కంపెనీ కార్యాలయాల్లో క్షేత్రస్థాయి పనిలో నిమగ్నం కావాలి తప్ప, తరగతి గది అభ్యసనానికి పరిమితం కాకూడదని నిబంధన విధించారు. దేశంలోని మొదటి 2000 టాప్ కంపెనీలు ఈ పథకంలో భాగస్వాములుగా ఉన్నాయి. అభ్యర్థులు అధికారిక వెబ్ పోర్టల్ (www.pminternship.mca.gov.in) ద్వారా తమ వివరాలను నమోదు చేసుకోవాలి. దరఖాస్తుదారుల ప్రొఫైల్ ఆధారంగా కంపెనీలు తమ అవసరాలకు తగిన వారిని షార్ట్ లిస్ట్ చేసి, ఇంటర్వ్యూల ద్వారా తుది ఎంపికను చేపడతాయి.
వీరు దరఖాస్తు చేయడానికి అనర్హులు
ప్రభుత్వ నిబంధనల ప్రకారం.. ఐఐటీ (IIT), ఐఐఎం (IIM), నేషనల్ లా యూనివర్సిటీలు, ఐఐఎస్సీ (IISc) వంటి ప్రతిష్టాత్మక సంస్థల నుంచి పట్టా పొందిన వారు ఈ పథకానికి అనర్హులు. అలాగే సీఏ, సీఎంఏ, సీఎస్, ఎంబీబీఎస్, ఎంబీఏ, పీహెచ్‌డీ వంటి వృత్తి విద్యా కోర్సులు చేసిన వారికి కూడా అవకాశం లేదు. అభ్యర్థి కుటుంబ ఆదాయం సంవత్సరానికి రూ. 12 లక్షల కంటే ఎక్కువగా ఉన్నా లేదా కుటుంబంలో ఎవరైనా శాశ్వత ప్రభుత్వ ఉద్యోగి ఉన్నా వారు ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవడానికి వీలుండదు. ఒకవేళ ఇంటర్న్‌షిప్ మధ్యలో అభ్యర్థి వ్యక్తిగత కారణాల వల్ల తప్పుకుంటే (Dropout), వారికి మరోసారి మాత్రమే అవకాశం కల్పిస్తారు. కానీ, క్రమశిక్షణా రాహిత్యం వల్ల కంపెనీ తొలగిస్తే (Termination) వారు మళ్లీ దరఖాస్తు చేయడానికి వీలుండదు.
మరిన్ని వివరాలు 'ప్రధాన మంత్రి ఇంటర్న్‌షిప్ పథకం' కు సంభందించిన వివరాల కోసం ....